దేశ వ్యాప్త ఉద్యమానికి దిక్సూచి కానున్న హైదరాబాద్
ఈనెల 29 న హైదరాబాద్ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ
సన్నాహక సమావేశంలో దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : భారత జీవిత భీమా అధికారులు, ఉద్యోగులు ఏజెంట్లు దేశ వ్యాప్తంగా ఉద్యమ బాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు కేటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానుంది. ఎల్ఐసిని ప్రైవేటీకరించేందుకు అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్స్ ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగానే ఈనెల 29న హైదరాబాద్ లో నిర్వహించనున్న దేశవ్యాప్త ప్రతినిధుల సమావేశంలో ఎల్ఐసి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఎల్ఐసి అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు, ట్రేడ్ యూనియన్ నాయకులతో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. ఎల్ఐసి ఉద్యోగ కార్మిక వర్గం చేసే ఉద్యమానికి టిఆర్ఎస్ కార్మిక విభాగం సంపూర్ణంగా అండగా నిలుస్తుందని అన్ని రకాల ఉద్యమ సహాయ సహకారాలు అందిస్తామని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. ఎల్ఐసిని ప్రైవేటీకరించే కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యలను ప్రజల్లో ఎండగడతామని వినోద్ కుమార్ తెలిపారు. ఎల్ఐసి ప్రకటించే ఉద్యమ కార్యాచరణను టిఆర్ఎస్ మద్దతునిస్తుందని వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ సన్నాహక సమావేశంలో ఎల్ఐసి ఏజెంట్ల జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, వివిధ డివిజన్ల నాయకులు తిరుపతయ్య, రఘు, రవీంద్రనాథ్, జేఏసీ చైర్మన్ బి ఎన్ చారి, టిఆర్ఎస్ కార్మిక విభాగం ఇన్చార్జి ఎల్. రూప్ సింగ్, సి.ఐ.టి.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.