హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు
మంత్రి కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ సభ్యులను నవ్వించింది. మెట్రో రైల్ పై సభ్యులు
అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిస్తున్నారు. ఈ క్రమంలో సీఎల్పీ నేత
భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రానికి మెట్రో రైల్ ను తీసుకొచ్చిందే తామని
వ్యాఖ్యానించారు. వైఎస్ పాలనలో మెట్రో రైలు ప్రాజెక్టును మొదలుపెట్టారని
చెప్పారు. అప్పటికీ, ఇప్పటికీ రేట్లలో చాలా వ్యత్యాసం ఉందని, ప్రకటనల్లో
గుత్తాధిపత్యం కల్పించడం కరెక్ట్ కాదని భట్టి సూచించారు. మంత్రి కేటీఆర్
బదులిస్తూ ప్రకటనల విషయంలో పాపమంతా కాంగ్రెస్ పార్టీదేనని తేల్చిచెప్పారు. ఆ
పార్టీ రూపొందించిన నిబంధనలనే ప్రస్తుతం తాము కొనసాగిస్తున్నామని, మెట్రో
పిల్లర్లపై ప్రకటనల విషయంలో తమ తప్పేమీలేదని చెప్పారు. ఇక తొమ్మిది నెలల
తర్వాత రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గురువారం
భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ సభలో
ప్రస్తావించారు. తొమ్మిది నెలల్లో వచ్చేది పిల్లలే కానీ కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీని 55 ఏళ్లు అధికారంలో
కూర్చోబెడితే ఆ పార్టీ ప్రజలకు చేసిందేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.