హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ప్రొఫెసర్
జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయాల బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అసెంబ్లీలో జరిగిన చట్ట సవరణకు సంబంధించిన చర్చలో పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. భద్రాచలం,
సీతారాంనగర్, శాంతినగర్, బూర్గంపాడు మండలంలోని సారపాక, ఐటీసీ, కుమ్రంభీం
ఆసిఫాబాద్ జిల్లాలోని రాజంపేటను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్టు
మంత్రి తెలిపారు. భద్రాచలంను మున్సిపాలిటీ చేయడానికి పలు చట్టాలు ఇబ్బందిగా
మారడంతో వాటిని గ్రామ పంచాయతీలుగా విభజించాల్సి వచ్చిందని చెప్పారు. వాటికి
ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొత్త పంచాయతీలుగా
ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ
చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి
నిరంజన్‌రెడ్డి సమాధానం ఇచ్చా రు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గురుకుల డిగ్రీ
కాలేజీల్లో ఉపాధి కల్పించే వ్యవసాయ కోర్సులను ప్రవేశపెట్టామని, వాటికి
అఫిలియేషన్ ఇచ్చేలా వ్య వసాయ విశ్వ విద్యాలయానికి అధికారం ఇస్తూ వర్సిటీ
చట్టానికి సవరణలు చేస్తున్నామని తెలిపారు. హోంసైన్స్ కాలేజీ పేరును కమ్యూనిటీ
సర్వీసెస్‌గా మారుస్తున్నామని వెల్లడించారు. ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా
ఆమోదం తెలిపింది.