ఈ నెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ
27, 28 తేదీల్లో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్ నేతలు
పల్లెల్లో పోలీసు బలగాల మోహరింపు
నల్గొండ : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి ఇంకా ఏడు రోజుల సమయమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ వేగం పెంచాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఇన్‌ఛార్జుల్లో పలువురు దీపావళి పండగ నిమిత్తం సొంత ప్రాంతాలకు వెళ్లారు. దీంతో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు అంతంతమాత్రంగానే ప్రచారం నిర్వహించాయి. తాజాగా వారందరూ నియోజకవర్గానికి తిరిగి చేరుకోవడంతో క్షేత్రస్థాయిలో మళ్లీ సందడి మొదలైంది. చండూరు పురపాలిక పరిధిలోని బంగారిగడ్డ వద్ద ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ప్రచారం ముగియటానికి రెండు రోజుల ముందు జరిగే ఈ సభ ద్వారా ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. ఆ సభ లోపు ప్రతి గ్రామంలోనూ పరిస్థితిని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని పార్టీ భావిస్తోంది. మరోవైపు ఈ నెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గతంలోనూ ఆగస్టు 21న సీఎం కేసీఆర్ సభ మునుగోడులో జరగగా ఒక రోజు వ్యవధిలోనే ఆగస్టు 22న కేంద్ర హోంమంత్రి సభ బహిరంగ సభ జరగడం విశేషం. మరోవైపు భాబీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలంతా క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీపావళి సందర్భంగానూ నియోజకవర్గంలోనే మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించారు. నడ్డా సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేస్తామని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సైతం ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తోంది.
భారత్ జోడో యాత్ర సందర్భంగా అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఈ నెల 27, 28 తేదీల్లో మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులతో పాటు పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి తెలిపారు. 27న నాలుగు మండలాలు, 28న మూడు మండలాల్లోని మొత్తం 298 బూత్‌ల నుంచి ఒక్కో బూత్ పరిధి నుంచి కనీసం 100 మంది చొప్పున కార్యకర్తలు పాదయాత్రకు రావాలని నాయకులు కోరుతున్నారు. అవసరమైతే నవంబరు 1న శంషాబాద్ సమీపంలో సభ ఏర్పాటు చేసి.. మునుగోడు నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలను పెద్దఎత్తున తరలించాలని నిర్ణయించారు. సభపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రాహుల్ యాత్రలో కార్యకర్తలు పాల్గొంటారని మాజీ మంత్రి వెల్లడించారు.
పల్లెల్లో పోలీసు బలగాల మోహరింపు : పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారం సందర్భంగా రెండు రోజుల క్రితం చౌటుప్పల్ మండలంలోని నాలుగు గ్రామాల్లో జరిగిన గొడవ ఇరువర్గాలు రాళ్ల దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. నారాయణపురం, మునుగోడు, నాంపల్లి మండలాల్లోని గ్రామాల్లోనూ నాలుగైదు రోజులుగా ప్రధాన పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య గొడవలు పెరిగాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో గొడవలు పెరిగే అవకాశం ఉందంటూ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసేవరకు సుమారు 40 గ్రామాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతో పహారా కాయాలని నివేదిక ఇచ్చాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఆయా గ్రామాల్లో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. దీంతోపాటు అనుమానితులను, నేర చరిత్ర ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.