కారు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్
కోలుకున్న తర్వాత అతడి చెంప వాయిస్తానంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్
కపిల్ దేవ్. ఇంతకీ.. దిగ్గజ క్రికెటర్‌కు పంత్‌పై కోపం ఎందుకొ తెలుసా? అతడు
ప్రమాదానికి గురవడంతో ఇప్పుడు జట్టు కూర్పు మొత్తం దెబ్బతిన్నదన్నదే కపిల్
ఆవేదన. ‘నాకు రిషబ్ పంత్ అంటే చాలా ఇష్టం. అతను త్వరగా కోలుకోవాలని బలంగా
కోరుకుంటున్నా. అప్పుడే కదా.. అతడి వద్దకెళ్లి చెంప పగలకొట్టి జాగ్రత్త
చెప్పగలను. ఆ రోజు అలా వేగంగా కారు నడపకుండా ఉండుంటే.. ఇప్పుడు సంతోషంగా
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఆడుతుండే వాడు. అతడు లేకపోవడంతో
వికెట్ కీపింగ్ కోసం ఒకరిని, అదనపు బ్యాటర్‌గా ఇంకొకరిని జట్టులోకి ఎంపిక
చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టు కూర్పు మొత్తం గందరగోళంలో పడినట్టయింది.
నిర్లక్ష్య ధోరణితో కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకోవడమే గాకుండా జట్టును కూడా
ఒకరకంగా ఇబ్బందుల్లోకి నెట్టేసే పరిస్థితికి కారకుడైన పంత్‌ను చెంప దెబ్బ
కొట్టాల్సిందే’ అని కపిల్ అన్నాడు.