సత్తెనపల్లి : గృహసారథులు, కన్వీనర్ల శిక్షణ కార్యక్రమాల్లో సత్తెనపల్లి
నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందు వరసలో ఉందని, పల్లె రాజకీయముఖ చిత్రంలో
గృహసారధులు, కన్వీనర్లే కీలకమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
అన్నారు. సోమవారం నియోజకవర్గ కార్యాలయంలో నకరికల్లు మండల గృహసారధులు,
కన్వీనర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా
మంత్రి అంబటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారసుడికి తెలుగులో మాట్లాడటమే
రావటం లేదని, ప్రశాంతత అనే పదాన్ని ప్రశాంతి అత్తని మాట్లాడుతున్నారని
విమర్శించారు. ఇలాంటి వాళ్ళందరూ నన్ను విమర్శిస్తున్నారని, ఎంతమంది, ఎన్ని
పార్టీల వారు నన్ను టార్గెట్ చేసినా ఐ డోంట్ కేర్ అన్నారు. మహానేత వైయస్సార్
రాజశేఖర్ రెడ్డి వెంట 1600 కిలోమీటర్లు నడిచానని, జగన్ మోహనరెడ్డి పార్టీ
పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశించిన
సామాజిక ప్రజా చైతన్య కార్యక్రమాల్లోనూ నియోజకవర్గం జిల్లాలో అగ్రస్థానంలో
ఉందన్నారు. ఏ పార్టీకి లేనంత పటిష్టమైన వ్యవస్థ మనకు ఉందని, మీరందరూ కష్టపడి
పనిచేస్తే రానున్న ఎన్నికల్లో మనకు అధికారం సునాయాసమేనన్నారు. వైఎస్సార్
సీపీది సుదీర్ఘమైన ప్రయాణం అన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు
తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పారదర్శకంగా,
ఇంత పెద్ద స్థాయిలో సంక్షేమం ఏ ప్రభుత్వం అమలు చేయలేదని వివరించారు. ఏ
పార్టీకి, ఏ గుర్తుకు ఓటు వేసినా వివక్షత లేకుండా సంక్షేమం పారదర్శకంగా అమలు
చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికే దక్కిందన్నారు. పల్నాడు జిల్లా మహిళా
అధ్యక్షురాలు డా.గీతా హసంతి మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఈ ప్రభుత్వం
నిదర్శనమన్నారు .నియామక పదవుల్లోనూ అత్యధిక శాతం మంది మహిళలు ఉండటం
అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ భవనం రాఘవ రెడ్డి,
జడ్పిటిసి సభ్యులు జె హరీష్, మండల ఇన్చార్జ్ మేడం ప్రవీణ్ రెడ్డి, దూదేకుల ఆదం
భాష, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, తదితరులున్నారు.