విజయవాడ : ప్రజాస్వామ్య హక్కులను, నిరసనలను కాలరాచేందుకు రాష్ట్ర ప్రభుత్వం
తీసుకువచ్చిన జీవో నం.1 రద్దు చేయకుంటే మార్చిలో ‘చలో అసెంబ్లీ’
నిర్వహించాల్సి ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని
హెచ్చరించారు. జీవో నం.1 రద్దు పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడ ఎం.బి. విజ్ఞాన కేంద్రంలో
శనివారం వేదిక కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ
సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు గన్నవరంలో ధర్నా పెట్టుకుంటే
అనుమతి ఇవ్వలేదని, లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఆయనపై కేసులు పెడుతున్నారని
రాష్ట్రంలో పోలీసులు కూడా ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలు బస్‌యాత్ర
చేస్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు
తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వటం లేదని
ప్రశ్నించారు. కోర్టులు లేకపోతే ఈ మూర్ఖుడు ఇంకా ఏమి చేశావాడో అని
ధ్వజమెత్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు హైకోర్టులో చివాట్లు తింటున్నారని
ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొడిగటిటందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్లు
ట్యాప్ చేస్తుంటే ఇక ప్రతిపక్షాల నాయకులు ఫోన్లు ట్యాప్ చేయటం సాధారణ విషయమే
అన్నారు. పోలీసులు ద్వారా, కోర్టుల ద్వారా, బెదిరింపుల ద్వారా ప్రభుత్వ
నిర్ణయాలను ప్రశ్నించే వారిని అణిచివేస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులు,
ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు గవర్నరు కలిసినందుకు సస్పెండ్
చేస్తామని ఉద్యోగులను బెదిరిస్తున్నారని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కడప స్టీల్ ప్లాంట్ కోసం పాదయాత్ర
చేయటానికి కూడా కోర్టు నుంచి అనుమతి పొందారని గుర్తు చేశారు. సీపీఎం నాయకులు
వై.వెంకటేశ్వరరావు ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే ప్రభుత్వాలకు అధికారంలో
కొనసాగలేవన్నారు. హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం దన్నారు. ఈ
సమావేశంలో పాల్గొన్న వక్తలు గత కార్యక్రమాలను సమీక్షించారు. ప్రజల వ్యతిరేకతను
ఏమాత్రం గౌరవించకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం
ప్రవర్తిస్తుందని, దీనిని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నదని వక్తలు
అభిప్రాయపడ్డారు. జీవో ఒకటి రద్దు పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని సమావేశం
నిర్ణయించింది. ఈ దిశగా ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు మాకినేని బసవ పున్నయ్య
విజ్ఞాన కేంద్రం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు జరపాలని సమావేశం
పిలుపునిచ్చింది.