విజయవాడ : విద్యార్థుల ప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసమే అయినప్పటికీ, సంఘసేవను
సైతం అలవరుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
అన్నారు. చదువుకు ఆటంకం లేకుండా సేవ చేసే అవకాశాన్ని అందించే జాతీయ సేవా
పధకంలో ప్రతి ఒక్క విద్యార్ధి భాగస్వాములు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి
గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతులో భాగస్వామ్యం వహించిన జాతీయ సేవా పధకం
విధ్యార్ధులు శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమై తమ అనుభవాలను
పంచుకున్నారు.
ఎన్ఎస్ఎస్ ద్వారా వారు సమాజానికి అందించిన సేవను గవర్నర్ దృష్టికి తీసుకు
వచ్చారు. కవాతు శిక్షణ ఏలా సాగిందన్న దానిని వివరించారు. ఈ సందర్భంగా హరిచందన్
మాట్లాడుతూ ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణమని జాతీయ సేవా పధకం
విద్యార్ధులు దీనిని ఆచరించటం ముదావహమన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్
విద్యార్ధులు జాతీయ సేవా పధకం ద్వారా మరిన్ని అవార్డులు సాధించాలని గౌరవ
గవర్నర్ ఆకాంక్షించారు.
ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు మాట్లాడుతూ రాష్ట్ర
ప్రభుత్వం విద్యార్ధులకు మేలు జరిగేలా విభిన్న కార్యక్రమాలను అమలు
చేస్తుందన్నారు. జాతీయ సేవా పధకంను ప్రోత్సహిస్తున్నామని, ప్రతి
విద్యార్ధిలోనూ సేవతత్పరత పెంపొందించేలా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు.
గవర్నర్ ను కలిసిన వారిలో జాతీయ అవార్ధు గ్రహీతలు రాష్ట్ర ఎన్ ఎస్ ఎస్ అధికారి
డాక్టర్ పి అశోక్ రెడ్డి, జితేంద్ర గౌడ్, పార్ధసారధి, సిరి దేవనపల్లి, డి.
సాయి కవాతులో పాల్గొన్న వందన, భువనేశ్వరి, రమ్య, మహాలక్ష్మి, దేదీప్య,
విఎస్ఎన్ లక్ష్మణ్, జిజి దీపక్ రెడ్డి, బి.గోపి, ఎస్ రెడ్డి జిష్ణు, జె. వాసు,
ఎన్ ఎస్ ఎస్ ఇటిఐ సమన్వయకర్త డాక్టర్ రామచంద్ర రావు ఉన్నారు. కార్యక్రమంలో
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి
సూర్య ప్రకాష్ తదితరులు ఉన్నారు.