విజయవాడ : రాష్ట్ర స్దాయి 25వ పాలిటెక్నిక్ క్రీడా పోటీలలో ఉత్సాహ భరిత
వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన
విద్యార్ధులు తమ సత్తా చాటేందుకు పోటీ పడుతుండగా సాయంత్రం విజయవాడ ప్రభుత్వ
పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవం అదరహో అనిపించింది.
వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధులు తమదైన శైలిలో రీమిక్స్ పాటలకు చేసిన
నృత్యాలు ఆహుతుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఇటు సాంప్రదాయం, అటు పాశ్చాచ్య
సంగీతానికి అనుగుణంగా అయా బృందాలు తమ ప్రతిభను ప్రదర్శించాయి. వడ్డేశ్వరం
కెఇఎస్ పాలిటెక్నిక్ విద్యార్ధులు కూచిపూడి నృత్యంతో సాంస్కృతిక ఉత్సవ్ కు ఘన
స్వాగతం పలకగా, విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్దులు రీమిక్స్ హోరుకు
అందించిన జోరైన నృత్యాలు ఉర్రూతలూగించాయి.
దాదాపు గంటకు పైగా సాగిన క్యాంప్ ఫైర్ యువతకు నూతన ఉత్తేజాన్ని అందించింది.
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలల వెంబడి గుండ్రంగా తిరుగుతూ విద్యార్ధులు
సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. తమలో దాగి ఉన్న ప్రతిభకు దీనిని వేదికగా
భావించిన విద్యార్ధులు విభిన్న కోణాలను ప్రదర్శించారు. సాంస్కృతిక ఉత్సవ్ కు
ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి
మాట్లాడుతూ విద్యార్దులలోని క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే
క్రమంలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నామన్నారు.
విద్యార్ధులు తరగతి గదులకే పరిమితం కాకుండా శారీరక, మానసిన వికాసానికి
తోడ్పాటును అందించే క్రీడలకు సముచిత ప్రాధన్యత ఇవ్వాలన్నారు. పూర్వపు జిల్లాల
స్దాయిలో విజయం సాధించిన 1500 మంది విద్యార్ధులు మొత్తం 19 అంశాలలో పోటీ
పడుతున్నాయని, శుక్రవారం విజేతల వివరాలను ప్రకటిస్తామని నాగరాణి పేర్కొన్నారు.
కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు పద్మారావు, సాంకేతిక
విద్యా బోర్డు కార్యదర్శి విజయ భాస్కర్, సంయిక్త కార్యదర్శి జానకి రామయ్య,
ప్రాంతీయ సంయిక్త సంచాలకులు జెఎస్ఎన్ మూర్తి, నిర్మల్ కుమార్ ప్రియ, ఉప
సంచాలకులు కళ్యాణ్, బోధన, ఉపాధి అధికారి రామకృష్ణ, స్ధానిక ప్రిన్సిపల్
విజయసారధి తదితరులు పాల్గొన్నారు.