గుంటూరు : తమ ప్రభుత్వానికి ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ఎంతో
ప్రతిష్టాత్మకమైనదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
ఆలోచనల్లోంచి పుట్టిన ఈ వైద్య విధానాన్ని ప్రజలకు విజయవంతంగా
అందజేయాల్సిన అవసరం అధికారులందరిపై ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన
కార్యాలయం, ఏపీఐఐసీ టవర్స్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం మంత్రి
విడదల రజిని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం,
సన్నద్ధతపై పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఈ మార్చి నుంచే ఫ్యామిలీ డాక్టర్
విధానాన్ని అధికారికంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి
లక్ష్యాన్ని నిర్దేశించారని, ఆ మేరకు అన్ని సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత
మనందరిపై ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్‌ల
ద్వారా ఈ వైద్య విధానాన్ని అందించబోతున్న నేపథ్యంలో ఆయా ఆస్పత్రుల
నిర్మాణాలన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఎక్కడా సమస్యలు ఉండటానికి వీల్లేదు
విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో ఇంకా ఎక్కడైనా సిబ్బంది ఖాళీలు ఉంటే.. వెంటనే
భర్తీ చేయాలని అధికారులకు మంత్రి విడదల రజిని సూచించారు. ఫ్యామిలీ
డాక్టర్ వైద్య విధానం అధికారికంగా ప్రారంభమయ్యేనాటికి ఏ విలేజ్ హెల్త్
క్లినిక్‌లోనూ మందులు, సిబ్బంది, రియేజంట్లు, పరికరాల కొరత అనే మాటే
రావడానికి వీల్లేదని, ఆయా సమస్యలు ఏవైనా ఉంటే ఇప్పుడే
పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ
సెంటర్లలోని పిల్లలందరికీ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంలో వైద్య
పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఆయా పరీక్షల్లో ఎవరికైనా
ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు
తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విషయంలో తగిన
కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చెప్పారు.
గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టండి
ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవన
ప్రమాణాలను మెరుగుపరుస్తుందనే ఆకాంక్ష ప్రభుత్వానికి ఉన్నదని మంత్రి
తెలిపారు. సికెల్ సెల్ అనీమియాతో బాధపడే వారందరినీ గుర్తించి వారి
ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన బాధ్యతను ఈ వైద్యవిధానం ద్వారా ప్రభుత్వం
తీసుకుంటున్నదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ వ్యాధి నివారణపై తగిన
కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. పరీక్షలు చేసేందుకు
కావాల్సిన కిట్లను వెనువెంటనే తెప్పించాలన్నారు. సికెల్ సెల్ అనీమియాకు
చికిత్సపై సమర్థవంతమైన కార్యాచరణ తయారుచేయాలని, పరీక్షలు
చేసేందుకు కిట్లు త్వరిత గతిన తెప్పించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు,
వాటి పురోగతిపై ఆరాతీశారు. యూపీహెచ్‌సీల్లో వసతులు, సిబ్బందిని గణనీయంగా
పెంచిన నేపథ్యంలో వాటిల్లో వైద్య సేవలు వినియోగించుకునే విషయమై ప్రజల్లో
అవగాహన పెంచాలని చెప్పారు.