మీరు తప్పకుండా రండి: సీఎం జగన్
ఢిల్లీలో ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సమావేశం
హాజరైన ఏపీ సీఎం జగన్
అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర వృద్ధిరేటు 11.43 శాతం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ దేశాల దౌత్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం ఏపీ అని స్పష్టం చేశారు. రాష్ట్ర జీఎస్డీపీ 11.43 శాతం అని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా తమదే అగ్రస్థానం అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో వస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 కారిడార్లు ఏపీలోనే నిర్మాణం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయని, మరో 4 పోర్టుల్ని కూడా నిర్మిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. మీ అందరినీ విశాఖకు రావాలని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కు విశాఖ రాజధాని అవుతోంది. నేను కూడా మరి కొన్ని నెలల్లో విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను. మీ అందరినీ విశాఖలో కలవాలని కోరుకుంటున్నానని వివరించారు.