గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పేదవారికి, పెత్తందారులకు మధ్య యుద్ధం
జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ యుద్ధంలో వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడే వారిని మీ బిడ్డ ఒంటరిగా
ఎదుర్కొంటున్నాడని చెప్పారు. ఇచ్చిన మాట మీద నిలబడే తనకు ముసలాయన (చంద్రబాబు)
మాదిరి ఓ పత్రిక తోడుగా ఉండకపోవచ్చని, పత్రిక అండగా నిలబడకపోవచ్చని, టీవీ
ఛానల్ తోడుగా ఉండకపోవచ్చని, దత్తపుత్రుడు తనకోసం మైకు పట్టుకోక పోవచ్చని జగన్
రెడ్డి అన్నారు. అయితే, తాను రాష్ట్రంలోని ప్రజలను నమ్ముకుని వారితో యుద్ధం
చేస్తున్నానని జగన్ చెప్పారు.
నిరుపేద వర్గాలను నమ్ముకుని, వారికోసం పోరాడుతున్నానని వివరించారు. తనకు
ఎవరితోనూ పొత్తుల్లేవని, తాను ఎవరినీ నమ్ముకోలేదని తేల్చిచెప్పారు. తనకు
ఉన్నదల్లా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మాత్రమేనని జగన్ స్పష్టం
చేశారు. ‘తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు.. అయినా భయపడకుండా మీ బిడ్డ సింహంలా
ఒక్కడే ఎదురెళుతున్నాడు. మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టే మీ బిడ్డ ధైర్యంగా
ముందుకు అడుగేస్తున్నాడు’ అని జగన్ రెడ్డి చెప్పారు. మీ దీవెనలు బిడ్డపై
ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ చెప్పారు. ముందు ముందు మరిన్ని మంచి
కార్యక్రమాలు చేపట్టేలా ఆశీర్వదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని
వివరించారు. సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ‘జగనన్న చేదోడు’ మూడో
విడత ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం లబ్దిదారులకు చెందిన
3,30,145 బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు.
రాష్ట్రంలోని చిన్న తరహా వ్యాపారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
తీసుకొచ్చిన పథకమే జగనన్న చేదోడు.. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దర్జీలు,
రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం
అందిస్తోంది.