విజయవాడ : ప్రజా స్వామ్య పురోగమనానికి నాంది పలికే శక్తిగల ఓటు హక్కును ప్రతి
ఒక్కరూ వినియోగించుకుని ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. 13వ జాతీయ ఓటర్ల
దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధ్వర్యంలో
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఓటర్ల దినోత్సవ వేడుకలకు
బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అమ్యులమైనదని ప్రజాస్వామ్య సామాజంలో
పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన అహింస సాదనం ఓటు హక్కు అన్నారు. మన
రాజ్యాంగం పౌరులందరికి సమాన ఓటు హక్కును కల్పించిందని, అర్హత, మతం, కులం, జాతి
వంటి వివక్షతలకు తావులేకుండా ఓటు హక్కును పవిత్ర హక్కుగా పరిగణిస్తారన్నారు.
ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యం కోసం దేశంలోని యువత అత్యంత చిత్త శుద్దితో ఓటు
హక్కును వినియోగించుకుని ఇతరులకు స్పూర్తిగా నిలవలన్నారు. ప్రజాస్వామ్య
వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 1950వ సంవత్సరంలో
ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక రోజైన జనవరి 25వ తేది జాతీయ ఓటర్ల
దినోత్సవాన్ని జరుపుకోవడం అనందదాయకమన్నారు. ఈ ఏడాది “నథింగ్ లైక్ ఓటింగ్ – ఐ
వోట్ ఫర్ సూర్ ” నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ప్రధాన కార్యాలయాలు
175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే రోజు ఓటర్ల దినోత్సవాన్ని జరపడాన్ని
అభినందిస్తున్నానన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు
కల్పించేందుకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగస్వామ్యులైన ప్రతి
ఒక్కరిని అభినందిస్తున్నానన్నారు. పౌరులు తమ పేరులను ఓటర్ల జాబితాలో నమోదు
చేసుకోవడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని
పరిరక్షించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ప్రభుత్వ , ప్రభుత్వేతర సంస్థలు
ఎన్నికల ప్రక్రియ గురించి ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్‌రెడ్డి మాట్లాడుతూ 18
సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటర్లగా నమోదై ఓటు హక్కును
వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై స్థిరమైన విశ్వాసం కలిగి
ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు.
ఎన్నికలలో జాతి కుల మతాలకు తావులేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఓటర్లగా తమ పేర్లను నమోదు చేసేందుకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు కృషి
చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో తమ మొబైల్ నెంబర్లను నమోదు చేసుకుని ఇ ఓటరు
కార్డును పొందవచ్చన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
మట్లాడుతూ అందరి సహకారంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు
కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత ఓటర్లకు అధార్ తో
అనుసంధానం చేసేందుకు ఫారం-6 బి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.