రాజమండ్రి : మీ డివిజన్లో శానిటేషన్ ఎలా ఉందని నగరంలో లలితా నగర్ ప్రజలను
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్
ప్రశ్నించారు. బాగా చేస్తున్నారు సార్, శానిటేషన్ ఇబ్బంది లేదు సార్..అంటూ
ఎంపీకి ప్రజలు సంతృప్తికర సమాధానం ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి
తెలుసుకున్నారు. ఏ సమస్యలూ లేవని ఆ వార్డు ప్రజలు ఎంతో సంతోషంగా చెప్పారు.
ఒకచోట ‘సార్ గుడ్ మార్నింగ్.. మీరు చిక్కిపోతున్నార్ సార్..మా అందరి మంచి
మీరు చూస్తున్నారు..మీ ఆరోగ్యం మీరే చూసుకోవాలి..జాగ్రత్త సార్’ అంటూ
ఆప్యాయంగా చెప్పడంతో ఎంపీ చిరునవ్వు నవ్వుతూ థాంక్యూ అంటూ ఆ వ్యక్తితో కరచాలనం
చేశారు. ఒక వృద్ధురాలు పెన్షన్ కోసం ఎంపీ భరత్ ను అభ్యర్థించింది. ఎందుకు
రావడం లేదని వలంటీర్ ను అడిగారు. ఆధార్ కార్డ్ లో వయసు తక్కువ ఉందని, ఆస్తి
ఉందని రకరకాల కారణాలు చెబుతుండటంతో ఎంపీ అసహనాన్ని వ్యక్తం చేశారు. వెంటనే
ఈమెకు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోమని వలంటీర్ కు ఎంపీ ఆదేశించారు. పెన్షన్
వచ్చే వరకూ నెల నెలా వెయ్యి రూపాయలు పెన్షన్ అందేలా ఏర్పాటు చేస్తా..అని ఆ
వృద్ధురాలికి ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. వార్డులో శానిటేషన్, రహదారులు శుభ్రంగా
ఉన్నాయని ఎంపీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ
అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, సబ్బవరపు సూరిబాబు తదితరులు
పాల్గొన్నారు.