సరైన అమ్మాయి దొరికితే వివాహానికి రెడీ అన్నకాంగ్రెస్ నేత
ప్రేమించే, తెలివిగల అమ్మాయి అయితే చాలని వెల్లడి
ఓ డిజిటల్ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ
దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఆయన బిజీగా ఉన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్
దాకా చేపట్టిన పాదయాత్ర కొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రాహుల్
ఓ డిజిటల్ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు ఆసక్తికర అంశాలను
పంచుకున్నారు. తన వివాహంపై అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. సరైన
అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని 52 ఏళ్ల రాహుల్ గాంధీ వెల్లడించారు.
‘మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా?’ అని యాంకర్ అడగ్గా…
సరైన అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటానని చెప్పారు. ‘చెక్‌లిస్టు
ఏమైనా ఉందా?’ అని యాంకర్ ప్రశ్నించగా ‘అదేమీ లేదు. ప్రేమించే వ్యక్తి,
ఇంటెలిజెంట్ అయితే చాలు’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘మీ మెసేజ్
అమ్మాయిలకు చేరుతుందిలేండి’ అని యాంకర్ అనడంతో ‘మీరు నన్ను ఇబ్బందుల్లో
పడేస్తున్నారు’ అంటూ రాహుల్ నవ్వేశారు. ఈ మధ్య రాహుల్ ఎక్కడికెళ్లినా పెళ్లి
గురించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి
గురించిన ప్రస్తావన రావడంతో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. తన తల్లి
సోనియా గాంధీ, తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి లక్షణాలు తనకు
కాబోయే భాగస్వామిలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరి ‘పెళ్లి ఎప్పుడు?’
అనే ప్రశ్నకు రాహుల్ జవాబు ఎప్పుడు చెబుతారో!