బుట్టాయిగూడెం : విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని
రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి డా.కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
టిబిఆర్ (తెల్లం బాల రాజు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్
కళాశాల క్రీడా మైదానంలో 3రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలను క్రీడా
జ్యోతిని వెలిగించి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ
సందర్భంగా మంత్రి డా.కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం
విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. గ్రామీణ
ప్రాంతాలలోని క్రీడాకారులలోని ప్రతిభను వెలికితీసేందుకు మండల, గ్రామీణ
స్థాయిలలో కూడా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
గ్రామీణ క్రీడాపోటీలలో అత్యుతమ ప్రతిభ కనపరిచిన వారికి శిక్షణ అందించి వారిని
అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కార్పొరేట్ పాఠశాలలు ఇరుకైన భవనాలలో నిర్వహించడంతో క్రీడా సదుపాయాలు ఉండవని,
అంతేకాక వారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వరన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద
పెద్ద క్రీడా మైదానాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయన్నారు. నాడు-నేడు
కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లోని క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడంతోపాటు,
క్రీడా పరికరాలు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచి క్రీడల పట్ల
విద్యార్థులతో మక్కువ పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. స్థానిక
శాసనసభ్యులు ప్రతీ సంవత్సరం తన ఫౌండేషన్ ద్వారా క్రీడా పోటీలు నిర్వహించడం
అభినందనీయమన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని
నెరవేర్చిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పేదరికమే అర్హతగా కుల, మత
,రాజీకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించిందన్నారు. టిడిపి
ప్రజలకు 600 వందలకు పైగా హామీలిచ్చి నెరవేర్చలేక మానిఫెస్టో ని తమ పార్టీ వెబ్
సైట్ నుండి తొలగించిందన్నారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల మంది నిరుపేద
కుటుంబాలకు రేషన్ కార్డులకు అందించామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కవురు
శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఆహ్లాదం, ఆరోగ్యం పెంపొందుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహానికి జిల్లా పరిషత్ నిధులు మంజూరు
చేస్తున్నామన్నారు.