విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గ
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 63 వ డివిజన్ MIG కాలనీ, సీ
కాలనీలలో రూ. 1.35 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్
మోదుగుల తిరుపతమ్మతో కలిసి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. సెంట్రల్
నియోజకవర్గ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక
దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ సీపీ
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులు, 14 వ ఆర్థిక సంఘం, 15వ
ఆర్థిక సంఘం, వీఎంసీ జనరల్ ఫండ్స్.. ఇలా పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ
ప్రజావసరాలను తీరుస్తున్నట్లు వివరించారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి
సారిస్తూ.. రహదారులను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గత
మూడున్నరేళ్లలో డివిజన్లో రూ. 2.92 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు
మల్లాది విష్ణు తెలిపారు. ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు అందించేందుకు
గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందన్నారు. రానున్న
రోజుల్లో ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని స్మార్ట్ సిటీ
చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం
నగరాన్ని పూర్తి నిర్లక్ష్యానికి గురిచేసిందని.. ఎక్కడా కనీసం ఒక్క రోడ్డు
వేసిన దాఖలాలు లేవని విమర్శించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులు, వీఎంసీ జనరల్ ఫండ్స్ ను
పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకుంటూ విజయవాడను అభివృద్ధి పథంలో
నడిపిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో
సెంట్రల్ నియోజకవర్గం ప్రగతిలో దూసుకెళుతోందని మేయర్ అన్నారు. కార్యక్రమంలో
నాయకులు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, సీహెచ్ రవి, యరగొర్ల శ్రీరాములు,
అనిల్, చిన్నారి, జిల్లేల్ల శివ, మేడా రమేష్, రామిరెడ్డి, వీఎంసీ అధికారులు,
సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.