తరలివెళ్తున్నారు. కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న నేపథ్యంలో
గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండనుందనే విషయంపై చైనా అధ్యక్షుడు ఆందోళన
చెందుతున్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. కరోనా వైరస్ విలయంతో
వణికిపోతోన్న చైనాను నూతన సంవత్సర వేడుకలు మరింత కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా
కోట్లాది మంది చైనీయులు సొంత గ్రామాలకు వెళ్లడం ఇందుకు కారణమవుతోంది. లూనార్
కొత్త సంవత్సరం సందర్భంగా వారంతా సొంతూళ్లకు వెళ్తుండటంతో వైరస్ ఉద్ధృతిని
గ్రామాలు తట్టుకుంటాయా? అనే ఆందోళన దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లో మొదలైనట్లు
చైనా అధికారిక మీడియా వెల్లడించింది.చైనాలో కొత్త సంవత్సరం వేడుకలను జనవరి 21 నుంచి ఫిబ్రవరి నాలుగోవారం వరకు
నిర్వహిస్తారు. ఈ 40 రోజుల సమయంలో భారీ సంఖ్యలో చైనీయులు తమ సొంత గ్రామాలకు
వెళ్తుంటారు. ఇప్పటికే బీజింగ్, షాంఘై వంటి మహా నగరాల్లో రైల్వేస్టేషన్లు
కిక్కిరిసిపోతున్నట్లు సమాచారం. అక్కడి ప్రయాణికుల వాహనాలు కూడా నగరాలు,
గ్రామాల మధ్య 200 కోట్ల ట్రిప్పులు తిరుగుతాయని రవాణా అధికారులు అంచనా
వేస్తున్నారు. జనవరి 7వ తేదీ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 48 కోట్ల ప్రజలు
స్థానికంగా ఆయా ప్రదేశాలకు ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే
ఈ సారి ప్రయాణికుల సంఖ్య భారీగా ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు గత
మూడేళ్లుగా కొవిడ్ ఆంక్షల కారణంగా తమ సొంత గ్రామాలకు వెళ్లలేదని.. ఈసారి
మాత్రం ఎలాగైనా ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడుపుతామని చైనీయులు మీడియాతో
చెబుతున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కొందరు పీపీఈ
కిట్లతో ప్రయాణించడం గమనార్హం.
ఇలా కొవిడ్ ఉద్ధృతిని చవిచూస్తోన్న నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం
అక్కడి అధికారుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదే విషయంపై అధ్యక్షుడు
జిన్‌పింగ్ కూడా ఆందోళన చెందుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటివరకు
కొవిడ్ కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం భారీ సంఖ్యలో ప్రజలు
గ్రామాలకు తరలివెళ్లడం వైరస్ మరోసారి ఉద్ధృతి చెందడానికి కారణమవుతుందనే
ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా
వెల్లడించింది. మరోవైపు కొవిడ్ విజృంభణ కారణంగా చైనాలో నిత్యం వందల సంఖ్యలో
మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే 60
వేల కొవిడ్ మరణాలు నమోదైనట్లు చైనా అధికారికంగా వెల్లడించింది. ఇక చైనా కొత్త
సంవత్సరం సెలవుల సమయంలో ప్రతిరోజు 36 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని
అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తుండటం అక్కడి అధికారులను కలవరపాటుకు
గురిచేస్తున్నాయి.