సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు
మురిసిపోతున్న యంగ్ టైగర్ అభిమానులు
న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్ కు వచ్చిన క్రికెటర్లు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో టీం ఇండియా క్రికెటర్లు సందడి చేశారు.
న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకున్న
విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నగరానికి చెందిన నజీర్ ఖాన్ ఇంట్లో ఈ భేటీ
జరిగినట్లు తెలుస్తోంది. ఖరీదైన కార్ల కలెక్షన్ తో గతంలో మీడియా దృష్టిని
ఆకర్షించిన నజీర్ ఖాన్ కు టీం ఇండియాలోని పలువురు ఆటగాళ్లు స్నేహితులు.
న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్లేయర్లు.. నజీర్ ఖాన్ ఇంట్లో
జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఫంక్షన్ కు
హాజరవడంతో క్రికెటర్లు ఆయనతో కలిసి ఫొటోలు దిగినట్లు సమాచారం. వరల్డ్ ఎన్టీఆర్
ఫ్యాన్స్ అనే యూజర్ ఈ ఫొటోలను ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
జూనియర్ ను కలిసిన వారిలో యుజ్వేంద్ర చహల్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్,
ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ తదితర ప్లేయర్లు ఉన్నారు. ఇటీవలే ఇయర్ ఎండ్
ట్రిప్ పేరుతో భార్య ప్రణతితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో పర్యటించి
వచ్చారు. ఆర్ఆర్ఆర్ టీమ్ తో కలిసి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవ
కార్యక్రమానికి హాజరయ్యారు. టీం ఇండియా ఆటగాళ్లతో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను
చూసి అభిమానులు మురిసిపోతున్నారు.