‘మిడ్‌లైఫ్ క్రైసిస్’తో బాధపడుతున్న కిమ్
రోజులో చాలా భాగం తాగుతూ, ఏడుస్తూ గడుపుతున్నారన్న ‘మిర్రర్’
తన అనారోగ్యంపై ఆందోళన చెందుతున్నారని కథనం
ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ మిడ్ లైఫ్ సంక్షోభంతో బాధపడుతున్నారని,
రోజుంతా ఏడుస్తూ, మద్యం తాగుతూ గడుపుతున్నారంటూ ఓ నివేదిక తాజాగా వెలుగులోకి
వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ వారంలో 39 ఏళ్ల వయసులోకి ప్రవేశించిన ఆయన
ప్రజలకు దూరంగా గడుపుతుండడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో
బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన బహుశా ‘మిడ్ లైఫ్ సంక్షోభం’తో
బాధపడుతుండొచ్చని ‘మిర్రర్’ ఓ కథనంలో పేర్కొంది.
మిడ్ లైఫ్ సంక్షోభం అంటే?
మిడ్ లైఫ్ సంక్షోభం అంటే మరేంటో కాదు..ఇది ఒక నిర్దిష్ట మానసిక అనారోగ్యం.
ఇంకా వివరంగా చెప్పాలంటే పురుషులు మధ్య వయసులోకి మారినప్పుడు కలిగే అసంతృప్తి,
ఆందోళన, నిరాశ, పశ్చాత్తాపం వంటివి చుట్టుముడతాయి. దీనినే ‘మిడ్ లైఫ్
క్రైసిస్’ అంటారు. కిమ్ 40ల్లోకి ప్రవేశించారని, అందుకే ఆయనీ పరిస్థితులను
ఎదుర్కొంటున్నారని సియోల్‌కు చెందిన నార్త్ కొరియన్ విద్యావేత్త డాక్టర్ చోయి
జిన్వుక్ తెలిపారు. కిమ్ రోజులో చాలా భాగం మద్యం తాగుతూ ఏడుస్తున్నట్టు తాను
విన్నానని పేర్కొన్నారు. ఒంటరిగా గడుపుతూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు
తెలిసిందన్నారు. తరచూ వ్యాయామాలు చేయాలన్న వైద్యుల సూచనలను కిమ్ పెడచెవిన
పెడుతున్నారని ‘మిర్రర్’ నివేదించింది. తన అనారోగ్య వార్తలపై కిమ్ ఆందోళన
చెందుతున్నట్టు పేర్కొంది. అంతేకాదు, కిమ్ విదేశాలకు వెళ్తున్నప్పుడు కూడా
సొంత టాయిలెట్‌ను తీసుకెళ్తున్నట్టు ‘మిర్రర్’ ఆ కథనంలో పేర్కొంది. తన ఆరోగ్య
సమస్యలు తెలుసుకోవడానికి గూఢచారులు తన మలమూత్ర విసర్జాల కోసం వెతకకుండా
ఉండేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కిమ్ తన వ్యక్తిగత
జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. గతేడాది తొలిసారి ఆయన తన కుమార్తెతో కలిసి
బహిరంగంగా కనిపించారు.