అమరావతి : తిరుమల కొండపై గదుల అద్దెను భారీగా పెంచడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తప్పుబట్టారు. ఒక్కసారిగా అద్దెను 1100 శాతం పెంచడం వెనక ఉద్దేశమేంటని దేవస్థానం పాలకవర్గంతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. పదే పదే గదుల అద్దెను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. సామాన్య
భక్తులకు శ్రీవారి దర్శనాన్ని భారంగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భక్తుల మనోభావాలను గుర్తించాలని, కలియుగ వైకుంఠం తిరుమల విషయంలో అహంకారం వద్దని ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు హితవు పలికారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే శ్రీవారి భక్తులపై మరింత భారం మోపుతూ గదుల అద్దెను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీగా పెంచేసింది. గతంలో రూ.150 ఉన్న అద్దె ప్రస్తుతం రూ,1,700, రూ.200 ఉన్న గది అద్దెను రూ.2,200లకు పెంచింది. ఇప్పటికే లడ్డూ ప్రసాదాల ధరలు పెంచిన టీటీడీ తాజాగా గదుల అద్దెను భారీగా పెంచడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.