పురస్కారం ‘గోల్డెన్ గ్లోబ్’ వరించింది. భారతీయ సినీ ప్రేక్షకులకు
‘ఆర్ఆర్ఆర్’ తీయని కబురు అందించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చలనచిత్ర
రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు ఈ చిత్రానికి
వరించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ ఈ అవార్డును సొంతం
చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఈ పాట వెనుక చిత్రబృందం
ఎంతో కష్టపడింది. ఈ పాట చిత్రీకరణ వెనుక ఆసక్తికర విషయాలను దర్శకుడు రాజమౌళి
గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.‘‘ఎన్టీఆర్, రామ్‌చరణ్ లపై ఓ మాస్ సాంగ్ తీయాలని అనుకున్నాం. సినిమాలోని
పాటలన్నింటికీ ఇది భిన్నంగా ఉండాలని భావించాం. ఈ పాటను యుద్ధానికి ముందు
ఉక్రెయిన్‌లో చిత్రీకరణ చేశాం. పాటలో కనిపించే భవనం నిజమైనదే. అది ఉక్రెయిన్
అధ్యక్షుడిది. ఆ ప్యాలెస్ పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. ఉక్రెయిన్
అధ్యక్షుడు ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ కావడంతో మేము అడగగానే పాట
చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. నిజంగా అది మా అదృష్టమే. ఇక్కడ ఇంకో విషయం
ఏంటంటే, జెలెన్స్కీ అధ్యక్షుడు కాకముందు ఒక టెలివిజన్ సిరీస్‌లో ఆయన
అధ్యక్షుడి పాత్ర పోషించారట’’ అని రాజమౌళి తెలిపారు.
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలకు చంద్రబోస్ చక్కటి తెలుగు
పదాలతో సాహిత్యం అందించారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ కాల భైరవ లు తమ గానంతో
పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.
గతంలో చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ‘నాటు నాటు’లో హుక్ స్టెప్ కోసం
80కి పైగా వేరియేషన్ స్టెప్స్‌ను ప్రేమ్ రక్షిత్ బృందం రికార్డు చేసిందట.
చివరకు భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిపే స్టెప్‌ను ఓకే
చేశారు. చిత్రీకరణ సమయంలో ఇద్దరు హీరోలు సింక్ అయ్యేలా స్టెప్ రావడానికి 18
టేక్‌లు తీసుకున్నారట. తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కగా డ్యాన్స్ చేయగల అతి
కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ టాప్‌లో ఉంటారు. అలాంటి వాళ్లే 18
టేక్‌లు తీసుకున్నారంటే పాట పర్ఫెక్ట్గా రావడానికి రాజమౌళి ఎంతలా
పరితపించారో అర్థం చేసుకోవచ్చు. హీరోలిద్దరూ స్టెప్స్ వేస్తుంటే
అందుకనుగుణంగా దుమ్ము లేవటం లేదని రాజమౌళి రీటేక్ చేయించారని సినిమా
ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ పంచుకున్నారు.