ఆ రాష్ట్ర ప్రజలే ఈ విషయాన్ని చెబుతున్నారు
తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఖమ్మం : తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని
ఆ రాష్ట్ర ప్రజలే చెప్పుకొంటున్నారని తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ఏపీలో భారాస కావాలని
చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు, సత్తుపల్లి
నియోజకవర్గాల్లో రూ.100 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాలేరు
నియోజకవర్గంలోని రామన్నపేట, సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మల్లవరంలో
నిర్వహించిన సభల్లో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో రహదారుల అభివృద్ధికి
రూ.20 వేల కోట్లు వెచ్చిస్తే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడి రోడ్లకు అదే
స్థాయిలో ఖర్చు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. భాజపా రాష్ట్ర
అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం
సరికాదన్నారు. నరేంద్ర మోడీ పాలనలో రూపాయి విలువ పడిపోయిందన్నారు. రూ.450 ఉన్న
సిలిండర్ ధర రూ.1100 దాటిందని, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని
చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రూపంలో తెలంగాణలో కేసీఆర్ సంపద సృష్టిస్తుంటే
ధరలు పెంచుతూ మోదీ ప్రభుత్వం దోచుకుంటోందని దుయ్యబట్టారు. రవాణాశాఖ మంత్రి
పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు, గుజరాత్
మోడల్ నినాదాలు విఫలమయ్యాయని, ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంటోందని
చెప్పారు.