మావి మాయ.. దీపక్ దంచుడు..
టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంకొత్త సంవత్సరాన్ని భారత్ థ్రిల్లింగ్ విక్టరీతో మొదలుపెట్టింది. శ్రీలంకపై
ఉత్కంఠ విజయం నమోదు చేసింది. చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్న రీతిలో సాగిన
హోరాహోరీ మ్యాచ్‌లో టీమ్ఇండియాదే పైచేయి అయింది. హార్దిక్ పాండ్యా
కెప్టెన్సీలో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత్.. లంకపై అద్భుత విజయం
సొంతం చేసుకుంది. దీపక్ హుడా, అక్షర్ పటేల్ ధనాధన్ బ్యాటింగ్‌తో పోరాడే
స్కోరు అందుకున్న టీమ్ఇండియా.అరంగేట్ర హీరో శివమ్ మావి విజృంభణతో లంకను
కట్టడి చేసింది. గెలుపు కోసం షనక, కరుణరత్నె కడదాకాపోరాడినా లంకకు అదృష్టం
దక్కలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది.
ముంబై: ‘మిషన్ 2024’లో భారత్ తొలి అడుగు ఘనంగా పడింది. వచ్చే ఏడాది జరిగే
టీ20 ప్రపంచకప్ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్న టీమ్ఇండియా యువ జట్టుతో
సత్తాచాటింది. ‘బిగ్ త్రీ’ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్
గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకున్న యువ క్రికెటర్లు ప్రత్యర్థి శ్రీలంకను
మట్టికరిపించారు. మంగళవారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో
టీమ్ఇండియా రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
తొలుత దీపక్ హుడా(23 బంతుల్లో 41నాటౌట్, ఫోర్, 4సిక్స్‌లు), అక్షర్
పటేల్(20 బంతుల్లో 31, 3ఫోర్లు, సిక్స్) విజృంభణతో టీమ్ఇండియా నిర్ణీత
ఓవర్లలో 162/5 స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్(7), సూర్యకుమార్(7),
శాంసన్(5) నిరాశపర్చగా, ఆఖర్లో హుడా, అక్షర్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును
ఆదుకున్నారు. వీరిద్దరు లంక బౌలింగ్ దాడికి ఎదురొడ్డి నిలుస్తూ కీలక పరుగులు
కొల్లగొట్టారు. ఆరో వికెట్‌కు వీరిద్దరు కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని
నెలకొల్పారు. లంక బౌలర్లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. హుడాకు ‘మ్యాన్ ఆఫ్ ద
మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 గురువారం జరుగుతుంది.
కడదాకా పోరాడినా…
భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో లంక కడదాకా పోరాడినా లాభం లేకపోయింది.
ఆదిలోనే యువ బౌలర్ శివమ్ మావి(4/22) లంకను దెబ్బతీయగా ఆఖర్లో కెప్టెన్
దసున్ షనక(45), చమికా కరుణరత్నె(23 నాటౌట్), డిసిల్వా(21) రాణించినా గెలుపు
తీరాలకు చేరుకోలేకపోయింది. ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో
అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంతో భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. ఆఖరి
రెండు బంతుల్లో రజిత(5), మధుశనక(0) ఔటయ్యారు. ఉమ్రాన్ మాలిక్( 2/27),
హర్షల్ పటేల్ (2/41) రెండేసి వికెట్లు తీశారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 162/5 (హుడా41 నాటౌట్, పటేల్ 31 నాటౌట్, డిసిల్వా 1/6,
హసరంగ 1/22)
శ్రీలంక: 20 ఓవర్లలో 160 (షనక 45, కరుణరత్నె 23 నాటౌట్, మావి 4/22, మాలిక్
2/27)