విజయవాడ : పెద్ద పత్రికలు చిన్న పత్రికలనే తారతమ్యం ఏమీ లేదని, పెద్ద పత్రికల
కంటే చిన్నపత్రికల్లోనే స్వేచ్ఛాయుత వార్తలు ప్రచురితమవుతాయని ఐజేయూ
ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. ప్రజాభిష్టం పత్రిక రూపొందించిన 2023
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో
జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అంబటి ఆంజనేయులు
మాట్లాడుతూ మైలేజ్ , సర్కులేషన్, జీఎస్టీ వంటి ఆంక్షలతో ఐ అండ్ పి ఆర్
డిపార్ట్మెంట్ చిన్న పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా నిరాకరిస్తుందని
ఆరోపించారు. ఇది సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక
సంక్షేమ కార్యక్రమాలను చిన్న పత్రికలోని ఎక్కువగా ప్రచురితమవుతాయని, అదేవిధంగా
ప్రజా సమస్యలు కూడా ఆపత్రికలో రావటం వల్ల సమస్యలను సత్వరమే పరిష్కరించే వీలు
ఉంటుందన్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి చిన్న పత్రికలను
ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ప్రస్తుత
ప్రజాభిష్టం పత్రిక సంపాదకులు ఎంవి సుబ్బారావు గతంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో
రిపోర్టర్ గా పనిచేసి రైల్వే సుబ్బారావు గా గుర్తింపు తెచ్చుకున్నారని
కొనియాడారు. సద్విమర్శలతో ఆయన వార్తలు ఉంటాయని అందువల్లే ఆయన పట్ల అటు
అధికారులకు, ఇటు రాజకీయ నాయకులకు అందరికీ గౌరవభావం పెరిగిందని ప్రశంసించారు.
ప్రతి సంవత్సరం రాజీ లేకుండా రంగులతో అందమైన క్యాలెండర్ను రూపొందిస్తున్న
సుబ్బారావు శ్రమ, కృషి ఈ క్యాలెండర్ లో కనబడుతుంది అన్నారు.
ప్రజాభీష్టం పత్రిక సంపాదకులు ఎం వి సుబ్బారావు మాట్లాడుతూ డిజిటల్ మీడియా,
సోషల్ మీడియా విజృంభిస్తున్న తరుణంలో కూడా అందమైన రంగుల క్యాలెండర్ ప్రతి
సంవత్సరం ఆవిష్కరిస్తున్నానని చెప్పారు. పోటి ప్రపంచంలో అడ్వర్టైజ్మెంట్లు
తీసుకురావడం కష్టంగా కత్తి మీద స్వాములా తయారయిందని అయినప్పటికీ, అటుపోట్లు
ఎన్ని ఎదురైనా క్రమం తప్పకుండా రంగుల క్యాలెండర్ ను తీసుకువస్తున్నామని
చెప్పారు. యాడ్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
తెలియజేశారు. క్యాలెండర్ ఆవిష్కరణకు ఆహ్వానించిన వారందరూ కార్యక్రమానికి వచ్చి
విజయవంతం చేసిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఇంకా ఈ
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్.కె బాబు, స్టేట్
స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సిహెచ్ రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు,
ఏపీయూడబ్ల్యూజే కృష్ణ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావారవి, కొండా
రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి వసంత్, ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్
సభ్యులు రామారావు, దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, ,ఇంకా సీనియర్
జర్నలిస్టు రాజారావు, శ్రీనివాస్ (జన జ్వాల), ప్రెస్ క్లబ్ కోశాధికారి
హుస్సేన్, యూనియన్ కోశాధికారి బీ.వి శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్
అధ్యక్షుడు సాంబశివరావు, యూనియన్ నాయకుడు రఘు, తదితరులు పాల్గొన్నారు.