కీవ్ సహా పలు నగరాల్లో విధ్వంసం
ఇద్దరు పౌరుల మృతి
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యాపెద్ద ఎత్తున క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఈ
ప్రభావంతో రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలకు
నష్టం కలిగింది. క్షిపణుల ప్రయోగంతో దేశమంతా హెచ్చరికలు మారుమోగాయి. మొత్తం
120 మిస్సైళ్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్
జెలెన్స్కీ సలహాదారు మిఖైలో పొదల్యాక్ వెల్లడించారు. క్షిపణులను
నిరోధించడానికి కీవ్‌లో గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశారు. విద్యుత్
సదుపాయాలపై మొత్తం 69 క్షిపణులను రష్యా ప్రయోగించగా వాటిలో 54 మిస్సైళ్లను
కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యం చీఫ్ జనరల్ వలెరి జలుజ్నీ వెల్లడించారు.
రష్యా దాడితో ఖర్కివ్‌లో ఇద్దరు పౌరులు మరణించినట్లు స్థానిక అధికారులు
తెలిపారు. ఓ 14 ఏళ్ల బాలిక సహా ముగ్గురు పౌరులు గాయపడగా వారిని ఆసుపత్రుల్లో
చేర్చినట్లు కీవ్ నగర మేయర్ విటాలీ క్లిట్స్చ్కో వెల్లడించారు. పౌరులు
నీటిని నిల్వ చేసుకోవాలని, వారి ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జి చేసుకోవాలని
సూచించారు. దాడుల నేపథ్యంలో పలు నగరాలు గంటలపాటు వెచ్చదనం, ఇంటర్నెట్,
విద్యుత్ సౌకర్యాలను కోల్పోయాయి.
లక్ష్య సాధనలో తొందరేం లేదు : ఉక్రెయిన్‌లో తమ లక్ష్యాలను సాధిస్తామని రష్యా
విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ స్పష్టం చేశారు. ఈ దిశగా సహనం, పట్టుదలతో
ముందుకు సాగుతున్నామని చెప్పారు. యుద్ధరంగంలో లక్ష్యాలను సాధించేందుకు కొంత
సమయం పడుతుందని పేర్కొంటూ ఈ విషయంలో తాము తొందరపడటం లేదని తెలిపారు.
‘ఉక్రెయిన్ వ్యవహారంలో పట్టుదల, సహనం, బలమైన సంకల్పంతో ఉన్నాం. రష్యా
ప్రజలకు, దేశానికి సంబంధించి ఎంతో కీలకమైన లక్ష్యాలను సాధిస్తామని
విశ్వసిస్తున్నా’ అని లవ్రోవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు.