హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. తనను విచారించినప్పుడు ఈడీ అధికారులకు ఏమీ దొరకలేదని, అందుకే సీబీఐని రంగంలోకి దించారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా రాలేదని, ఆ కాపీ చూసిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సిట్ లేదా సీబీఐతో విచారణ చేయించాలని తొలుత నిందితులే కోరారని, సిట్‌లో సీనియర్ పోలీసు అధికారులను నియమించారని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించాలి. కావాలనే నన్ను ఈడీ అధికారులతో వేధించారు. ఈ కేసులోని వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన భాజపా నేతలు, నిందితులకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు. న్యాయవ్యవస్థలో ఉన్న సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని వారు విచారణకు రావడం లేదు. ఈడీ, సీబీఐ ఏది వచ్చినా మేం సిద్ధంగానే ఉన్నాం. తప్పు చేయనప్పుడు మాకు భయం అవసరం లేదు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసముంది. చివరకు న్యాయమే గెలుస్తుంది. ఈడీ విచారణపై ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాం. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని రోహిత్‌రెడ్డి అన్నారు.