ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నాన్న(చలపతిరావు)ను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు. అనారోగ్యంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రవిబాబు మీడియాకు తెలియజేశారు. ‘నాన్న నిన్న రాత్రి భోజనం చేసేవరకు బాగానే ఉన్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ కూర తిని..ఆ ప్లేట్ అలా ఇచ్చి..వెనక్కి వాలిపోయారు. ఇంత సింపుల్గా వెళ్లిపోయారాయన. ఈ రోజు అంత్యక్రియలు చేద్దామనుకున్నాం. కానీ మా అక్కలు ఇద్దరూ అమెరికా లో ఉన్నారు. వాళ్ళు మంగళవారం రాత్రి కి వస్తారు. మంగళవారం వరకు మహా ప్రస్థానం లో ఫ్రీజర్ లో ఉంచుతాం. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని రవిబాబు అన్నారు. తన తండ్రికి ఎన్టీఆర్, మంచి భోజనం, జోక్స్ అంటే చాలా ఇష్టమని, ఎంతో అభిమానించే ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం తన తండ్రికి దక్కిందని రవిబాబు అన్నారు.