టిడిపిలో బిసిలకు న్యాయం జరగదని తెలుసుకుని..
I తనను నమ్ముకున్నవాళ్ళ అస్థిత్వం కోసం త్వరలో..
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
బిసిలకు తెలుగుదేశం పార్టీలో ఇక న్యాయం జరిగేపరిస్థితులు లేవని తెలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ వైసిపిలోకి వెళ్ళనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వెంకటగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలోని బిసిలతో కలిసి వైసిపిలోకి జంప్ అవనున్నట్లు తెలిసింది. పార్టీ మారడం గురించి తనతో వున్న ముఖ్యమైన బిసి నాయకులు, ముఖ్య అనుచరులతో ఈ మేరకు చర్చించి ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వైసిపి అధిష్టానం వద్ద ఇదివరకే డాక్టర్ మస్తాన్ యాదవ్ టిడిపి నుంచి వస్తున్న సమాచారంపై చర్చ కూడా జరిగినట్లు తెలిసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 70 నుంచి 80 లక్షల మంది బిసిలు ఉన్నా ఒక్కరంటే ఒక్క బిసికి కూడా టిక్కెట్ ఇవ్వకపోవడం నిజంగా టిడిపికి బిసిలను బాగు చెయ్యాలన్న చిత్తశుద్ధి ఉన్నట్టేనా? అని బిసిలు ప్రశ్నిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి రెండు జిల్లాల్లో కలిపి నలుగురికి, ఐదుగురికి టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళు ఒక్క బిసికి మాత్రం టిక్కెట్ ఎందుకు ఇవ్వలేకపోయిందో ? కనీసం పిలిచి సమాధానం చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి లేకుండా పోయిందని బిసి నాయకులు ధ్వజమెత్తుతున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ దృష్టికి తెచ్చినప్పటికీ పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. కేవలం డబ్బుతోనే తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని, కాబట్టే బిసిలను ఓటు బ్యాంకుగా ఉపన్యాసాల్లో నాలుగు మాటలు మాట్లాడటం, బిసి డిక్లరేషన్లంటూ పెద్ద పెద్ద పోస్టర్లు ఆవిష్కరించడం తప్ప నిజంగా చిత్తశుద్ధి వుంటే వెంకటగిరి టిక్కెట్‌ను బిసిలకు కేటాయించేవారని చెబుతున్నారు. మస్తాన్ యాదవ్‌కు ఇవ్వకపోయినా ఏ ఒక్క బిసికైనా, కనీసం గంగోడు నాగేశ్వరరావు, బీదా రవిచంద్ర ఇలా ఎంతో మంది వెంకటగిరి తెలుగుదేశం టిక్కెట్ కోసం బిసిలు ఎదురుచూస్తున్నా ఎందుకివ్వలేకపోయిందన్న దానికి ఇప్పటికీ సమాధానం లేకుండా పోయిందని బిసి ముఖ్యనేతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మూడవ జాబితా కూడా వచ్చేయడంతో బిసిలకు విలువలేని చోట, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీలో ఇక ఎంత మాత్రం కొనసాగడం ఇష్టం లేక మస్తాన్ యాదవ్ పార్టీని వీడనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజులుగా వైసిపికి వెళ్తున్న సమాచారం ప్రచారంలో వుంది. దీనిపై ఆయన అనుచరులు కొందరు అవునన్నట్లుగా సమాధానం చెబుతున్నారు. ఇది నిజంగానే తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా షాక్ లాంటిదని భావించవచ్చు.