వెంకటగిరి: జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించేవరకూ సమ్మె విరమించబోమని కార్మికులు హెచ్చరించారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కుతున్నారు. ప్రతి పట్టణ కేంద్రంలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటగిరి మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు, సిఐటియు నాయకులు శనివారం ముట్టడి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు వడ్డేపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి సుబ్బయ్య, కార్యదర్శి ఎస్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ… గత 12 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నామన్నారు. వేతనాలు పెంచకుండా వారి సమస్యల పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉందని అన్నారు. ఈ విధంగా మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను ఇంటికి సాగనంపిన చరిత్ర మున్సిపల్ కార్మికులదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన సమస్యలనుపరిష్కారం చేయాలని అన్నారు. కార్మికులు ఏమి గొంతెమ్మ కోర్కెలు ఏమి కోరడం లేదని అన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయమని అడుగుతున్నామని,లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు . నిరవధిక సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించక పోగా ప్రయివేట్ కార్మికులను తీసుకొచ్చి పనులు చేయించడం, వారిని అడ్డుకున్న కార్మికులు, సిఐటియు నాయకులను అరెస్టు చేయడం, కేసులు మోపడం చాలా దుర్మార్గమైన విషయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సిఐటియు నాయకులు వెంకటసుబ్బయ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.